టీటీడీ అధికారులు బ్లాక్ లో టిక్కెట్లు అమ్ముకుంటున్నా సర్కారు పట్టించుకోవడం లేదు: బీజేపీ నేత లక్ష్మణ్ ఆరోపణలు

  • అక్రమార్కులకు నిలయంగా మారిన టీటీడీ
  • నిత్యమూ టిక్కెట్లను బ్లాక్ లో అమ్ముకుంటున్నారు
  • గవర్నర్ కు ఫిర్యాదు చేసిన అనంతరం మీడియాతో లక్ష్మణ్
తిరుమల తిరుపతి దేవస్థానం అక్రమార్కులకు నిలయంగా మారిపోయిందని, అక్కడ అధికారులు ఎన్ని దారుణాలకు పాల్పడుతున్నా, ఏపీ ప్రభుత్వం ఎటువంటి చర్యలూ తీసుకోవడం లేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ఆరోపించారు. ఈ ఉదయం పలువురు బీజేపీ నేతలతో కలిసి గవర్నర్ వద్దకు వెళ్లి, టీటీడీలో జరుగుతున్న అవినీతి, అక్రమాలను గురించి ఫిర్యాదు చేసిన ఆయన, అనంతరం మీడియాతో మాట్లాడారు.

రోజురోజుకూ అధికారుల ఆగడాలు పెచ్చుమీరుతున్నాయని ఆరోపించిన ఆయన, గత నెలలో టిక్కెట్ల కుంభకోణం వెలుగులోకి వచ్చిందని గుర్తు చేశారు. టిక్కెట్లను భారీ ఎత్తున అమ్ముకుంటున్నారని బహిర్గతమైనా ఏపీ సర్కారు పట్టించుకోలేదని చెప్పారు. నిందితులను ఇంతవరకూ అరెస్ట్ చేయలేదని, కనీసం వారిపై విచారణ కూడా జరిపించలేదని లక్ష్మణ్ ఆరోపించారు. నిత్యమూ వందలాది టిక్కెట్లను బ్లాక్ లో అమ్ముతూ కోట్లను దండుకుంటున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

లక్ష్మణ్ తో పాటు నరసింహన్ ను కలిసిన మాజీ డీజీపీ, ప్రస్తుత బీజేపీ నేత దినేష్ రెడ్డి మాట్లాడుతూ, తాను డీజీపీగా ఉన్న సమయంలో అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించి అరెస్ట్ చేశామని చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న అవినీతి, అక్రమాలపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని తాము గవర్నర్ ను కోరినట్టు ఆయన తెలిపారు.
Go Back to Shorts
BJP
Lakshman
ESL Narasimhan
TTD
Tirumala
Tirupati

More Telugu News